గ్రద్ద మరియు పిల్లి కథ – స్నేహం వెనుక దాగిన మోసం :
భాగీరథి నది ఒడ్డున ముసలి గ్రద్ద :
ఒకప్పుడు భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో జరద్గవం అనే ముసలి గ్రద్ద నివసించేది. వయసు పైబడటంతో దానికి కళ్ళు కనిపించేవి కావు. అందువల్ల ఆహారం కోసం బయటకు వెళ్లలేకపోయేది. ఆ చెట్టుపై నివసించే పక్షులు తమకు దొరికిన ఆహారంలో కొంత భాగాన్ని గ్రద్దకు ఇచ్చేవి. అందుకు కృతజ్ఞతగా జరద్గవం పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది.
పక్షి పిల్లలను తినడానికి వచ్చిన పిల్లి :
ఒకరోజు దీర్ఘకర్ణుడు అనే పిల్లి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను చూసి వాటిని తినాలని ఆశపడింది. వెంటనే చెట్టు ఎక్కింది. పిల్లి రావడం చూసిన పక్షి పిల్లలు భయంతో గట్టిగా అరవసాగాయి.
ఆ అరుపులు విన్న జరద్గవం తొర్రలో నుంచి బయటకు వచ్చి, “ఎవరక్కడ? ఎందుకు అలా అరుస్తున్నారు?” అని గట్టిగా ప్రశ్నించింది.
ఆ గ్రద్దను చూసి పిల్లి భయపడింది. తప్పించుకునే మార్గం లేక, “అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేను పిల్లిని” అని చెప్పింది.
వెంటనే గ్రద్ద కోపంగా, “నువ్వు పిల్లివా? అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను!” అని హెచ్చరించింది.
అప్పుడు పిల్లి వినయంగా మాట్లాడుతూ, “అయ్యా! దయచేసి నా మాట వినండి. నేను పిల్లినే అయినా మాంసం తినను. ధర్మంగా జీవిస్తాను. మీరు చాలా మంచివారని ఈ చెట్టుపై ఉండే పక్షుల ద్వారా తెలుసుకున్నాను. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీతో స్నేహం చేయాలని ఉంది” అని చెప్పింది.
గ్రద్ద మరియు పిల్లి మధ్య స్నేహం :
ఆ మాటలు విన్న జరద్గవం పిల్లి చెప్పిన మాటలను నిజమని నమ్మింది. అలా కొద్దిరోజుల్లోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ సాయంత్రం పిల్లి వచ్చి గ్రద్దతో కబుర్లు చెబుతూ ఉండేది.
కొన్ని రోజుల తర్వాత చెట్టుపై ఉన్న పక్షుల పిల్లలు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోవడం ప్రారంభమైంది. పక్షులన్నీ ఆందోళన చెందాయి. చివరకు ఒకరోజు కలిసి వచ్చి జరద్గవాన్ని నిలదీశాయి.
గ్రద్దపై అనుమానం పెంచుకున్న పక్షులు :
“మా పిల్లలు కనిపించడం లేదు. వాటి గురించి మీకు ఏమైనా తెలుసా?” అని అడిగాయి.
తనకేమీ తెలియదని గ్రద్ద చెప్పింది. కానీ అనుమానం వచ్చిన పక్షులు గ్రద్ద నివసించే తొర్రలోకి తొంగిచూశాయి. అక్కడ పక్షుల ఈకలు, ఎముకలు కనిపించాయి. వాటిని చూసిన పక్షులు తమ పిల్లలను గ్రద్దే తినేసిందని పొరబడ్డాయి.
కోపంతో ఆ గ్రద్దపై దాడి చేసి చంపేశాయి. నిజానికి ఆ పిల్లి పక్షి పిల్లలను చంపి తిని, వాటి ఎముకలను గ్రద్ద తొర్రలో పడేసేది.
చివరకు గ్రద్ద తన తప్పు తెలుసుకుంది. చెడు స్వభావం ఉన్న పిల్లి మాయమాటలను నమ్మి స్నేహం చేసినందుకు ప్రాణాలు కోల్పోయింది.
నీతి: మాయమాటలు నమ్మి మోసపోకూడదు. స్నేహం చేసే ముందు ఎదుటివారి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి.