నీతి కథలు

పిచ్చుక గుణం – మంచి స్నేహం విలువ తెలిపే నీతి కథ:

3 నిమిషాలు చదవండి

పిచ్చుక గుణం – మంచి స్నేహం విలువ తెలిపే నీతి కథ :

అమాయక పిచ్చుక కు కొత్త స్నేహితులు:

అనగనగా ఒక చిన్న గ్రామంలో ఎంతో అమాయకమైన పిచ్చుక నివసించేది. ఆ పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరికీ హాని చేయాలనే ఆలోచన దానికి ఉండేది కాదు. ఒక రోజు ఆ పిచ్చుక కు కాకుల గుంపు పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే వాటితో పిచ్చుక కు స్నేహం ఏర్పడింది.

గ్రామంలోని ఇతర పక్షులు పిచ్చుక ను హెచ్చరించాయి.

“ఆ కాకులతో ఎక్కువగా స్నేహం చేయకు. అవి చేసే పనులు మంచివి కావు. చెడు స్నేహం నీకూ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు,” అని చెప్పాయి.

కానీ అమాయకమైన పిచ్చుక వారి మాటలను పట్టించుకోలేదు. “నా స్నేహితులు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు” అని వాటిని గుడ్డిగా నమ్మింది.

చెడు స్నేహం వల్ల వచ్చిన ప్రమాదం.?

ఒక రోజు కాకుల గుంపు ఎక్కడికో వెళ్తూ పిచ్చుక ను కూడా తమతో రావాలని పిలిచింది. పిచుక ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అని అడగకుండా వాటితో పాటు బయలుదేరింది.

కొంతసేపటికి అవన్నీ ఒక రైతు పొలానికి చేరుకున్నాయి. అక్కడ కాకులు పంటపై వాలి మొక్కలను పాడు చేయడం ప్రారంభించాయి. పంటను నాశనం చేస్తూ అవి అల్లరి చేయసాగాయి.

పిచ్చుక మాత్రం ఏం చేయాలో తెలియక ఆందోళనగా అటూ ఇటూ ఎగురుతూ ఉంది. తాను ఆ పని చేయకపోయినా, చెడు పని చేస్తున్నవారి మధ్య ఉండటం వల్ల ప్రమాదంలో చిక్కుకుంది.

పిచ్చుక కు ఎదురైన కష్టం?

కొద్దిసేపటికి పంట నాశనం అవుతున్న విషయం గమనించిన రైతులు కోపంతో పొలం వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు. వారి చేతుల్లో పెద్ద కర్రలు ఉన్నాయి.

రైతులు రావడం చూసిన కాకులు వెంటనే తుర్రున ఎగిరిపోయాయి. వాటికి ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం అలవాటే. కానీ అమాయకమైన పిచుక మాత్రం తప్పించుకోలేక అక్కడే చిక్కుకుంది.

“బాబోయ్! నన్ను కొట్టకండి! నేను ఏ తప్పూ చేయలేదు. నేను అమాయకురాలిని. పంటను నేను పాడు చేయలేదు,” అని పిచ్చుక వేడుకుంది.

కానీ రైతులు చాలా కోపంగా ఉన్నారు. పంట నాశనం చేసిన పక్షుల గుంపుతో కలిసి పిచ్చుక  కూడా కనిపించడంతో, అది నిర్దోషి అని వారు నమ్మలేదు. పిచ్చుక కు కూడా శిక్ష తప్పలేదు.

అప్పుడు పిచ్చుక కు తన తప్పు అర్థమైంది. తాను చెడు పని చేయకపోయినా, చెడ్డవారి స్నేహం వల్ల తానే కష్టాల్లో పడింది.

మంచి స్నేహితులను ఎంచుకోవాలి: 

ఈ సంఘటన తర్వాత పిచుకకు ఒక గొప్ప నిజం తెలిసింది. మనం ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తామో, సమాజం కూడా మన గురించి అలాంటి అభిప్రాయమే ఏర్పరుచుకుంటుంది. మంచి మనుషులతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు పెరుగుతాయి. చెడు అలవాట్లు ఉన్నవారితో కలిసి ఉంటే, మనకు తెలియకుండానే సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు వారి గుణగణాలను కూడా గమనించాలి. నిజాయితీగా, మంచిగా ఉండే వారితో స్నేహం చేయడం మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.

నీతి : 

మనతో స్నేహం చేసే వారిని చూసి, మన స్వభావం మరియు గుణగణాలను కూడా ఇతరులు అంచనా వేస్తారు.”. కాబట్టి మంచి స్నేహితులను ఎంచుకోవాలి; చెడు స్నేహం ఎప్పుడూ కష్టాలను తెస్తుంది.”

మీ అభిప్రాయం చెప్పండి